Weather Latest Update: ఏపీ వ్యాప్తంగా పొడి వాతావరణమే, ఇక్కడ పొగమంచు – తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Spread the love

విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు.

ఏపీ, యానాం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. క్రిష్ణా, గుంటూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.

ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.

పంజాబ్, హరియాణా – చండీగఢ్ – ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.

హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 31.8 డిగ్రీలు, 17.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *