TIRUPATHI – అన్నదమ్ములిద్దరూ పెద్ద ముదుర్లు.. పుష్ప సినిమా రేంజ్‌లో!
TIRUPATHI – ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వారిద్దరిదీ అందెవేసిన చేయి. ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణాచేస్తూ పోలీసుల వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఉన్నారు ఆ ఇద్దరు సోదరులు. ఇద్దరిపైనా వివిధ జిల్లాలలో 89 కేసులు కూడా ఉన్నాయి. ఇంతటి నేరచరిత్ర ఉన్న బ్రదర్స్‌ను తిరుపతి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 31ఎర్రచందనం దుంగలు, ఆరు సెల్ ఫోన్లు,ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.
కడప జల్లా చాపాడు మండలానికి చెందిన షేక్ చెంపతిలాల్ బాషా, షేక్ చంపతి జాకీర్ లు సోదరులు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. పక్కా ప్లాన్‌తో పోలీసులకు దొరకకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారు ఈ బ్రదర్స్. అక్రమ రవాణాలో ఆరితేరిపోయినవీరిపై సుమారు 90 వరకూ కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరికోసం గత కొంతకాలంగా పోలీసులు గాలిస్తున్నారు.
తాజాగా పక్కా స్కెచ్ వేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి కదలికలపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసుల బృందం చాకచక్యంగా పట్టుకుంది. మరోవైపు పోలీస్ యూనిఫాం ధరించి కూడా వీరు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు.