Supreme Court: సుప్రీంకోర్టుకు చేరిన రాజధాని రగడ..

Spread the love

Supreme Court: సుప్రీంకోర్టుకు చేరిన రాజధాని రగడ.. రాజధానికి పిటిషన్లపై విచారణ నేడే..

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు చేసి తీరుతామని ప్రభుత్వం.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటం చర్చనీయాంశంగా మారింది.గతంలో అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన జగన్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ మేరకు సుప్రీంకోర్టులో సోమవారం అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో పాటు విభజన కేసులన్నింటినీ విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు అంశాలపై ఇప్పటివరకు 35 కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను జస్టిస్ కే.ఎం.జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయి ధర్మాసనం విచారణ చేయనుంది.

రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో వెల్లడించింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని పేర్కొంది. శాసన, పాలన వ్యవస్థ అధికారాల్లోకి న్యాయ వ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధంగా ఉందని పిటిషన్ లో జత చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని స్పష్టం చేసింది.

రాష్ట్ ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోనే పరిమితం చేయకండా వికేంద్రీకరణ చేసేలా చూడాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. 2014-19 కాలంలో కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే జరిగాయని, అవి కూడా తాత్కాలికమేనని వివరించింది. అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మించడానికి రూ.1,09,000 కోట్లు అవసరమైతే..

వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ.2000 కోట్లతో పూర్తవుతుందని పిటిషన్ లో వెల్లడించింది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదన్న సర్కార్.. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి వాస్తవం లేదని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విన్నపించుకుంది.

కాగా, అమరావతి రాజధాని పిటిషన్లపై విచారణ జరిపించాలని రైతుల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం తెలియకుంటే విచారణ చేపట్టలేమని కోర్టు పేర్కొంది. దీనిపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోరారు. అత్యంత కీలకమైన అంశం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఈ నెల 7న విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఇవాళ జరగనున్న విచారణ ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *