Lord Shiva: శివుడికే భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ దేవి.

Spread the love

Lord Shiva: శివుడికే భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ దేవి….కాశీలో అన్నపూర్ణ దేవి ఎలా ఆవిర్భవించి?

 

శ్లోకం: ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ, నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ; సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ.. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

నవరాత్రులలో ఐదో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి.

ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది, కాశీ విశ్వనాధుడు.

వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు.

 

 

పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే, ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది.

కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కధ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంధాలు, పురాణాల ప్రకారం… ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీ దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది.

దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను మాత బిక్షందేహి అని తనకు అన్నప్రసాదాలు ప్రసాదించమని కోరాడని పురాణాలు చెపుతున్నాయి.

పార్వతి సంతోషించి, శివునికి తన చేతులతో ఆహారాన్ని సమర్పించి, తన భక్తుల కోసం వారణాసిలో అన్నపూర్ణ దేవి గా దర్శనమిస్తోంది. అన్నపూర్ణాదేవిని శివుడు . ఈ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మ వారికీ గంధపురంగు లేదా పసుపు రంగు చీరతో అలంకరించి – దద్దోజనం, క్షీరాన్నం , అల్లం గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.

వారణాశి లో అన్నపూర్ణ ఆలయంలో అన్నపూర్ణ దేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దీపావళి తరువాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు.

ఇతర రోజులలో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది.ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. వారికి ఇక్కడ ప్రత్యేక నాణేలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణ దేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *