Sr Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం…. విపక్షాలు సైతం విమర్శలు.

Spread the love

Sr Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం…. విపక్షాలు సైతం విమర్శలు.

Sr Ntr-నందమూరి తారకరామారావు హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లు ఆమోదించుకుంది.

చంద్రబాబు కంటే తనకే ఎన్టీఆర్ అంటే గౌరవం ఉన్నదని సభలో చెప్పుకున్న జగన్, ఈ సందర్భాన్ని చంద్రబాబుమీద ఎదురుదాడికి, ఆడియోలూ వీడియోల ప్రదర్శనకు సభా సమయాన్ని వాడుకున్నారు.

తాను ఓ పక్క Sr Ntrపేరు చెరిపేస్తూనే, కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని నిలదీస్తున్నారు. తెలుగుప్రజలంతా అన్నగా ఆరాధించే నందమూరి తారకరామారావుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అవమానం తెలుగువారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

పార్టీలతోనూ, ప్రాంతాలతోనూ నిమిత్తం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ చర్యపై ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. పిదపకాలం ముంచుకొస్తే పెడబుద్ధులు పుడతాయని పెద్దలు అంటారు. జగన్మోహన్ రెడ్డి అధికార ప్రస్థానమే వినాశనంతోనూ, కూల్చివేతలతో మొదలైంది.

 

వ్యవస్థల నిర్మాణం కంటే కూల్చిందే ఎక్కువ కనుక నిర్మించడంలో ఉన్న కష్టం ఆయనకు తెలియదు. చరిత్ర తెలియనివారే ఇటువంటి విధ్వంసాలకు పాల్పడతారు. అప్పట్లో మెడికల్ కాలేజీలు ఆయా యూనివర్సిటీల పరిధిలో ఉంటూ, అల్లర్లు ఆందోళనల వంటి పలు కారణాలతో పరీక్షలు వాయిదాపడుతూ, నకిలీ సర్టిఫికేట్ల సమస్యతోనూ, అర్హులైన బోధకులు లేక వైద్యవిద్య పతనమైన స్థితిలో, దేశంలోనే తొలిసారిగా ఎన్టీరామారావు పూనిక వహించి ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.

అన్ని దేశీయ వైద్యవిధానాలనూ, పారా మెడికల్ కోర్సులనూ ఈ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర వైద్యవిద్యకు విలువనూ, సాధికారతనూ సమకూర్చారు. పటిష్టమైన చట్టాలతో మెడికల్ కాలేజీలను ఇలా ఆయన ఓ దారికి తెచ్చిన వెంటనే తమిళనాడు అనుసరించింది, మిగతా రాష్ట్రాల్లోనూ హెల్త్ యూనివర్సిటీలు ఏర్పడ్డాయి.

హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ మానసపుత్రిక. ఆయన ముందుచూపునకు నిదర్శనం. తెలుగుగడ్డమీద వేలాదిమందిని నైపుణ్యం గల వైద్యవిద్యార్థులుగా తీర్చిదిద్ది, అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకొనేట్టు చేసింది.

అందువల్లనే, ఆయన మరణానంతరం Sr Ntr పేరు పెట్టినందుకు తెలుగుప్రజలంతా సంతోషించారు. అటువంటి మహనీయుని పేరును నిష్కారణంగా తొలగించడం ఉన్మాదం కాక ఇంకేమిటి?
రాష్ట్రంలో సాగుతున్న విద్వేషపూరిత పాలనకు పరాకాష్ఠ ఈ నిర్ణయం.

వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యరంగంలో చేసిన కృషిని ఎవరూ కాదనడం లేదు. ఇప్పటికే గత పథకాలన్నింటి పేర్లూ చెరిపేసి, ఆయా వృత్తులతో సంబంధం లేకున్నా వైఎస్ఆర్ పేరు పెట్టారు. కొన్ని పథకాలకు జగనన్న తోక తగిలించుకున్నారు.

చివరకు అంబేడ్కర్‌నూ వదిలిపెట్టలేదు. ఇప్పుడు సంస్థలమీదా, వ్యవస్థలమీదా పడ్డారు. ఒక కొత్త సంస్థను సృష్టించి తండ్రిపేరో, తనపేరో పెట్టుకోవచ్చు, ప్రజారోగ్యాన్ని పరిరక్షించే వినూత్న వ్యవస్థలను ఏర్పరచి నచ్చిన నామకరణం చేసుకోవచ్చు.

కానీ, అసలు రాష్ట్రంలో నిర్మాణం ఎక్కడుంది? అంతా విధ్వంసమే. గతంలో నిర్మించినవాటిని కూల్చివేయడం, మిగిలినవాటి పేర్లు మార్చి భుజాలెగరేయడం తప్ప జగన్ ప్రభుత్వానికి ఇంకేమీ చేతకావడం లేదు. ద్వేషమే పునాదిగా ఏలుబడి సాగుతున్నది.

ఇప్పుడు ఎన్టీఆర్‌ను కూడా వదలనందున ఒక కులంమీద జగన్ కక్షకట్టాడన్న వాదనకు మరింత బలం చేకూరుతున్నది. నిరుపేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ల రద్దు వెనుక కూడా ఈ విషమే ఉన్నదని ఇప్పుడు చాలామందికి అనిపిస్తున్నది.

ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా నిలిపినవాడు, విపక్షపార్టీలన్నింటిని కలిపి కుట్టి ఢిల్లీని కుదిపేసినవాడు. జగన్మోహన్ రెడ్డిలాగా కేంద్రం ముందు సాగిలబడలేదు, అప్పులతో రాష్ట్రాన్ని ముంచలేదు.

వ్యవస్థలను ప్రక్షాళించి పేదలకు అన్నంపెట్టాడే కానీ, జగన్ లాగా ఎవరిపొట్టా కొట్టలేదు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించిన ఓ మహనీయుడిని అవమానించి, తెలుగుదేశం మీద దాడి చేసినందుకు సంబరపడుతున్నారు జగన్.

ఎన్టీఆర్‌ది చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదు. అధికారమదంతో యూనివర్సిటీ పేరు మార్చగలరేమో కానీ, ప్రజల హృదయాల్లో ఆయన చిరంజీవి. ఎన్టీఆర్ కారణంగా రాజకీయజన్మ ఎత్తిన ఎంతోమంది వైసీపీ నాయకులు తమ అధినాయకుడిని కనీసం ప్రశ్నించలేనంతగా దిగజారిపోవడం విషాదం. ఈ నిర్ణయం న్యాయస్థానాల్లో నిలిచేది కాదు కానీ, తమ పాలకుడి నిజస్వరూపాన్ని మరోమారు ప్రజలకు విస్పష్టంగా తెలియచెబుతున్నది.